తిలక్ వర్మ డైనమిక్ బ్యాటింగ్.. పంజాబ్‌పై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ

  • పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం
  • 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించిన ముంబై
  • కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తిలక్ వర్మ
ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో ఛేదించింది. యువ బ్యాటర్ తిలక్ వర్మ (75*) అజేయ అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ముందు పంజాబ్ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (32 బంతుల్లో 57) హాఫ్ సెంచరీతో మెరవగా, చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (17 బంతుల్లో 38) మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరును 200కు చేర్చాడు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 39 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్ జోరుకు అడ్డుకట్ట వేశాడు.

భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్ రియాన్ రికిల్టన్ (23 బంతుల్లో 48) అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. మధ్యలో స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడినప్పటికీ, క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి విల్ జాక్స్ (10 బంతుల్లో 25*) చక్కటి సహకారం అందించడంతో ముంబై మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

టోర్నీ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ అవకాశాలను దెబ్బతీసింది. పంజాబ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, ఇతర మ్యాచ్ ల ఫలితాలు ఆ జట్టు అవకాశాలపై ప్రభావం చూపుతాయి. 

Tilak Varma
Mumbai Indians
Punjab Kings
IPL 2024
Indian Premier League
Shardul Thakur
Riyan Rickelton
Dharamshala
Cricket
T20

More Telugu News